పర్సెంటేజీలు వచ్చే పనులకే వేల కోట్ల ఫండ్స్ : మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

పర్సెంటేజీలు వచ్చే పనులకే వేల కోట్ల ఫండ్స్ : మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

మెదక్, వెలుగు: కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పర్సెంటేజీలు వచ్చే పనులకే వేల కోట్ల ఫండ్స్  కేటాయిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. మంగళవారం మెదక్  బీఆర్ఎస్  పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదని, రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు.

ఉద్యోగులకు డీఏ, రిటైర్డ్​ బెనిఫిట్స్, మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా, బడా కాంట్రాక్టర్లకు రూ.14 వేల కోట్ల బిల్లులు చెల్లించారని చెప్పారు. హెచ్ఎండీఏలో పనులకు రూ.20 వేల కోట్లు, హైదరాబాద్  మెట్రో వాటర్  వర్క్ లకు రూ.15 వేల కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.7 వేల కోట్లు, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఆమనగల్లులో 10 లేన్ల రోడ్డుకు రూ.10 వేల కోట్లు, ఫ్యూచర్  సిటీ రోడ్డుకు రూ.5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

రైతులు, మహిళలు, అంగన్ వాడీ టీచర్లు, సర్వ శిక్ష ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల వారిని రేవంత్ రెడ్డి సర్కారు దగా చేస్తోందన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులు కాంగ్రెస్  నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా దాటవేసేందుకు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా చేశారని విమర్శించారు.

శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని వమ్ము చేశారన్నారు. ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డి,  పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్  హుసేన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్  పాల్గొన్నారు.